Home UTF History Ikya Upadhyaya Magazine News GO's Statements Mahasabhalu Photo Gallery STFI- School Teacher's Federation of India
 
 
 
 
 
 

 

UTF News

సంపూర్ణ అక్షరాస్యత ఇలాగేనా?
- కె.విజయగౌరి

ప్రపంచానికే నిరక్షరాస్యత ఒక పెద్ద కళంకం. విద్యలేని చోట పేదరికం ఉందంటే, పేదరికం ఉన్నచోట విద్యలేదన్నది అత్యంత సామాజిక వాస్తవం. నిరక్షరాస్యత నిర్మూలన, నిర్బంధ ప్రాథమిక విద్య, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలన వంటి ప్రధాన లక్ష్యాలతో 1965 సెప్టెంబరు 8న టెహరాన్‌లో మంత్రిత్వ స్థాయి సదస్సును యునెస్కో నిర్వహించింది. ప్రతిపౌరునికి విద్య నేర్చుకునే హక్కు ఉందని చాటే రోజు ఇది. ఆ సదస్సు లో చేసిన తీర్మానాలు ఇప్పటికీ పూర్తిగా అమలుకునోచుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా 77కోట్ల మంది నిరక్షరాస్యులుంటే ఒక్క భారతదేశంలో 27కోట్ల మంది ఉన్నారని యునెస్కో నివేదిక 2008 తెలియజేసింది. 177దేశాలకుగాను భారత్‌ 105వ స్థానంలో ఉంది. 2010నాటికి కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యం నెరవేరే స్థితి కానరాకపోవడంతో ఇప్పుడీ గడువును 2015 వరకు పొడిగించారు.

విద్యారంగంలో అన్ని స్థాయిల్లోనూ స్త్రీపురుష సమానత్వాన్ని సాధించాలని ఇఎఫ్‌ఎ సదస్సు నిర్దేశించింది. 2005నాటికి, 2008 నాటికి అక్షరాస్యత సాధించాలని నిర్దేశించుకున్న లక్ష్యాలకు భారత్‌తో సహా అనేక దేశాలు ఆమడ దూరంలో ఉన్నాయని ఇఎఫ్‌ఎ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.విద్యాభివృద్ధిసూచిక (ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌)ను సార్వత్రిక ప్రాథమిక విద్య,వయోజన అక్షరాస్యత, స్త్రీపురుష నిష్పత్తి, విద్య నాణ్యత అనే నాలుగు అంశాల ప్రాతిపదికన నిర్ణయిస్తారు. ఆ ప్రకారం భారత్‌ అక్షరాస్యత సాధనలో ప్రపంచంలో నూరవ స్థానంలో ఉందని గత ఏడాది ఢిల్లీలో జరిగిన సదస్సు ప్రకటించింది.

1960 దశకంలోనే స్థూలజాతీయోత్పత్తి (జిడిపి)లో 10శాతం నిధులు విద్యకు వెచ్చించాలని అనుకున్నా ప్రభుత్వ రంగం, ప్రైవేట్‌ రంగం అంతా కలిపి చూసినా నేటికీ 4 శాతానికి మించి కేటాయించలేని పరిస్థితి. జిడిపిలో 6శాతం అనేది కలగానే మిగిలిపోయింది.

బడికిరాని పిల్లలు భారతదేశంలో 4కోట్లపైబడి ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 62 ఏళ్లు గడచినా జాతీయ అక్షరాస్యత 66 శాతం వద్దే వుంది. 1951లో మన అక్షరాస్యత 18.3 శాతంగా వుండేది. ప్రపంచంలో 5కోట్లకు పైచిలుకు టీచర్లు ఉంటే మన దేశంలో 9శాతం మాత్రమే ఉన్నారు. మధ్యలో బడిమానేసిన వారి సంఖ్య మన దేశంలో పెరిగిపోవడానికి ఇది కూడా ఒక కారణం. జాతీయ అక్షరాస్యత ఇలా వుంటే, రాష్ట్ర అక్షరాస్యత (61 శాతం) మరీ అధ్వానంగా వుంది. అందులోనూ దళితులు, ఆదివాసీలలో అక్షరాస్యత 50- 57శాతం మధ్యే వుంది.

ప్రాథమిక విద్యను విస్మరించి సంపూర్ణ అక్షరాస్యత గురించి మాట్లాడి ప్రయోజనం ఉండదు. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే సార్వత్రిక ప్రాథóమిక విద్యావ్యాప్తి తప్పనిసరి.

కమిటీలు - సదస్సులు

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అనేక కమిటీలు వేశారు. సదస్సులు, చర్చాగోష్టులు జరిపారు. విద్యా పథకాలు తెచ్చారు. 1947 రాధాకృష్ణన్‌ కమిటీ, 1952 మొదలియార్‌ కమిటీ, 1964 కొఠారికమిటీ, 1977 ఈశ్వర్‌భారు కమిటీ, 1986లో రాజీవ్‌నూతన విద్యా విధానం, 1992 యశ్‌పాల్‌ కమిటీ, వీటితో పాటు ఎపెప్‌, డిపెప్‌, ఎస్‌ఎస్‌ఎ, ఎల్‌ఇపి పథకాలు, వీటితో పాటు 1965లో టెహరాన్‌లో విద్యా సదస్సు, 1990 థారులాండ్‌ విద్యాసదస్సు, 2000లో సెనెగల్‌ సదస్సు, 2008 ఢిల్లీ సదస్సు ఇవన్నీ ప్రాథమిక విద్య, సంపూర్ణ అక్షరాస్యత గురించి చర్చించాయి.

ఆచరణకొచ్చేసరికి ప్రపంచబ్యాంకు విధానాలకే ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ ద్వంద్వ ప్రమాణాలను పాటించడం వల్లే అక్షరాస్యతలో ప్రపంచంలో భారత్‌ వందో స్థానం, దేశంలో మన రాష్ట్రం 28వ స్థానంలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి బదులు మరింత దిగజార్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. ఉపాధ్యాయులను కుదించడం, పాఠశాలలను మూసివేయడం, విద్యారంగం కార్పోరేటీకరణ వంటివి ఇందుకు కొన్ని మచ్చుతునకలు.

మధ్యలో బడి మానేసిన పిల్లల సంఖ్య (డ్రాపవుట్స్‌ రేటు) తగ్గకపోవడానికి, నమోదు శాతం పెరగకపోవడానికి వలసలు పోవడం, పౌష్టికాహార లోపం, నిధుల కేటాయింపులో కోత, విద్యారంగంపై ఖర్చు వృథా అని ప్రభుత్వాలు భావించడం వంటి ధోరణులే కారణమని యునెస్కో పేర్కొంది. ప్రపంచ వ్యాపిత అనుభవాలు దీనినే రుజువు చేస్తున్నాయి.

ఇఎఫ్‌ఎ 2003 నివేదిక ప్రపంచ అనుభవాలను సమీక్షిస్తూ సామాజిక మార్పును సాధించకుండా విద్యారంగంలో వివక్షను తొలగించలేమని స్పష్టంగా చెప్పింది. అందరికీ అక్షరాస్యత బాధ్యత ప్రభుత్వానిదే. దీని సాధనకు రాజకీయ చిత్తశుద్ధి ఎంతయినా అవసరం'

( రచయిత్రి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి)
 
 
 
 

PDF
 
 

Copyright © 2008-
A.P.United Teachers' Federation
Mail to : aputf2000@yahoo.com
Home | Ikya Upadhyaya | News | GO's | Statements | STFI | Contact Us