Home UTF History Ikya Upadhyaya Magazine News GO's Statements Mahasabhalu Photo Gallery STFI- School Teacher's Federation of India
 
 
 
 
 
 

 

UTF News

ఉపాధ్యాయ వృత్తే ఉదాత్తమైంది!
* నేడు ఉపాధ్యాయ దినోత్సవం
- నాగాటి నారాయణ

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతిఏటా సెప్టెంబర్‌ 5న దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుగుతుంది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి హఠాన్మరణంతో నెలకొన్న విషాదం వలన ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ గురు భక్తిని ప్రత్యేకంగా గుర్తించాలి.

దివంగత ముఖ్యమంత్రి జ్ఞాపకాల్లో కొన్నింటిని ఒక తెలుగు దినపత్రిక ప్రచురించింది. అందులో మొదటి అంశం యిలా వుంది. ''మా నాన్న పనులపై ఇంటిపట్టున వుండే వారు కాదు. నా చదువు పాడై పోకుండా వెంకటప్ప టీచర్‌ ఇంట్లో వుండే వాణ్ణి. జీవితంలో చదువొక్కటే ముఖ్యం కాదని, చక్కటి వ్యక్తిత్వం ముఖ్యమని ఆయన బోధించేవారు. ఆయన నన్ను బాగా ప్రభావితం చేశారు. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది అయనే''. నిర్మొహమాటం నా స్వభావం అని చెప్పినప్పుడు కూడ గురువు గారిని గుర్తు చేశారు. ''నిత్య అసమ్మతి వాదిగా ముద్రపడడానికి కారణం నా నిర్మొహమాటమే. చిన్నప్పటి నుంచి అమ్మానాన్న, వెంకటప్ప పంతులు అదే నేర్పారు''. ఈ ప్రశంస ఉపాధ్యాయుల పట్ల ఆయనకు గల కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తున్నది. ఆయన చెప్పిన వెంకటప్ప పంతులు జ్ఞాపకార్థంగా మూడేళ్ల క్రితమే పులివెందులలో పెద్ద హైస్కూల్‌ కట్టించారు. ఇలాంటి కొన్ని ఉదాహరణలు విద్యారంగం, ఉపాధ్యాయులపట్ల వైఎస్‌ఆర్‌కి గల అభిమానాన్ని సూచిస్తున్నా ఆయన హయాంలోనే ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం 13 రోజులు సమ్మె చేయాల్సిన చేదు అనుభవం కూడ మిగిలిపోయింది.

ఈ సందర్బంగా మరో ఉదంతాన్ని గమనించాలి. తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలో వెంకట్రామన్‌ అనే రిటైర్డ్‌ టీచర్‌కి అపూర్వమైన పురష్కారం లభించింది. 85 సంవత్సరాల వయసుతో ఒక అద్దె ఇంట్లోవుంటున్న ఆ పంతులుగారి పరిస్థితిని గమనించిన పూర్వ శిశువుల్లో కొందరు రు. 10 లక్షల విరాళాల సేకరించి మంచి భవనాన్ని నిర్మించారు. దానికి 'గురు నివాస్‌' అని పేరు పెట్టారు. రిటైరయి 25 సంవత్సరాలు గడిచినా ఆ ఉపాధ్యాయుడు తన శిశ్యుల గుండెల్లో ఎంత పదిలంగా నిలిచివున్నారో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఆ భవనాన్ని ఈ ఉపాధ్యాయ దినోత్సవం (ది.05.09.2009) సందర్బంగా గురుదక్షిణగా సమర్పిస్తున్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చనిపోయిన 34 సంవత్సరాల తర్వాత ఆయన స్వరాష్ట్రం తమిళనాడులోనే గురుభక్తికి కోదవలేదని చాటిచెప్పే యీ సందర్భం ఎంతైనా ప్రశంసనీయం. ఆనాడు రాధాకృష్ణన్‌ని బండిమీద కూర్చోబెట్టి శిశ్యులు బండిని లాక్కొంటూ రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్లి రైలెక్కించారని చెప్పుకోవటం ఎంత గోప్పవిషయమో ఇదీ అంతే అన్పిస్తుంది.

భారతీయ సమాజంలో గురువుకి అత్యున్నత గౌరవం అనాదిగా వస్తున్నదే. అయితే గౌరవాలు, విలువలు కాలమాన పరిపరిస్థితుల్ని బట్టి మారుతుంటాయి. ఆర్థిక విధానాల్లో వచ్చిన మార్పలు, వాటితో మారిపోయిన మానవ సంబంధాలు, ముఖ్యంగా పెరిగిపోయిన ప్రైవేటీకరణ ఫలితంగా ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యం కూడా అతలాకుతలం అవుతున్నది. అయినా ఏ సమాజానికైనా విద్యా, వైజ్ఞానిక అవసరాలు వున్నంతకాలం, సాంకేతిక సమాచార వ్యవస్థ ఎంత విస్తరించినా ఉపాధ్యాయుడి పాత్ర అజరామరంగా నిలుస్తుంది. ప్రజాభిప్రాయాన్ని సేకరించే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఏ.పీ.నీల్సన్‌ రెండేళ్ల క్రితం భారత దేశంలో ఒక ప్రత్యేక సర్వే చేసింది. ముఖ్యమైన 15 రకాల వృత్తుల్ని ఎంచుకొని అందులో ఏది గౌరవప్రదమైన వృత్తి అనేది ఆ సర్వే ఉద్ధేశం. ఉపాధ్యాయ వృత్తే అన్నిటికంటే గౌరవప్రదమైన వృత్తి అని సర్వేలో తేలినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఆ సర్వే దేశంలోని 8 ముఖ్యమైన నగరాల్లో జరిగింది. నగరాల్లోనే ఉపాధ్యాయుల పట్ల అంత ఆదరణ వుందంటే గ్రామీణ ప్రాంతంలో మరింత ఆదరణ వుంటుందని చెప్పుకోవచ్చును.

ఒకనాడు ఉపాధ్యాయుడ్ని బ్రతకలేని బడిపంతులు అనే వారు, ఈనాడు బ్రతకనేర్చిన బడిపంతుళ్లు అంటున్నారు. కానీ బ్రతుకు నేర్పేవారే బడి పంతుళ్లు అనే నినాదాన్ని అర్థం చేసుకొని అమలు చెయ్యటానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. ఉపాధ్యాయ ఉద్యమాలు, వివిధ కమీషన్‌ల సిఫారసులు, విస్తరించిన విద్యావకాశాల ఫలితంగా ఉపాధ్యాయుల జీత భత్యాలు ఒక మేరకు పెరిగాయి. సర్వీస్‌ కండిషన్‌లు మెరుగయినాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలోని పాఠశాల ఉపాధ్యాయులు కొన్ని విషయాల్లో గర్వించదగిన స్థితిలో వున్నాయి. రీగ్రూప్‌డ్‌ పే స్కూల్స్‌, అప్రయత్న పదోన్నతి, కౌన్సిలింగ్‌ ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో బదిలీలు వంటివి ఆ కోవలోకి వస్తాయి. కానీ అప్రెంటీస్‌ విధానం, వివిధ మేనేజిమెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అసమాన అవకాశాలు, ఎయిడెడ్‌ టీచర్లకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయం వంటి అపసృతులూ మన రాష్ట్రంలోనే కొనసాగుతున్నాయి. ఇలాంటి అసమానతలు, అన్యాయాలను అధిగమించటానికి రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమం కృషి చేయాలి. మారుతున్న కాలమాన పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ పెరిగిపోతున్న విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకొంటూ, విద్యారంగ నూతన సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగటానికి, ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని నిలబెట్టటానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. జీత భత్యాలు, సర్వీస్‌ ప్రయోజనాలు ఎంత పెరిగినా, సర్వేల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా ప్రజలు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని పొందలేకపోతే ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యం గత కాలపు వైభవంగానే మిగిలిపోతుందనే వాస్తవాన్ని ఉపాధ్యాయులు గుర్తించాలి.

(రచయిత యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు)
 
 
 
 

PDF
 
 

Copyright © 2008-
A.P.United Teachers' Federation
Mail to : aputf2000@yahoo.com
Home | Ikya Upadhyaya | News | GO's | Statements | STFI | Contact Us